Wednesday 14 July 2010

సమస్యా పూరణ౦ - 5


కవి మిత్రులారా! ఈ రోజు పూరించ వలసిన సమస్య.........

"సంసారిగ నున్న వాఁడె సన్యాసి యగున్".


5 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

సంసార మందు సుఖము ప్ర
శంసించుచు పెండ్లియాడి చక్కగ నుండెన్.
సంసారము వికటించిన
"సంసారిగ నున్న వాఁడె సన్యాసి యగున్".

జిగురు సత్యనారాయణ said...

సంసారమందు సతి గృహ
హింస యనుచును బెదిరించి యిడుముల త్రోయన్
కంసారి యైనను సగటు
సంసారిగ నున్న, వాఁడె సన్యాసి యగున్!!

సుమిత్ర said...

రామకృష్ణారావుగారు, సత్యనారాయణగారు,
పూరణలు బాగున్నాయి. ధన్యవాదములు. ఇలాగే మీ ఆశీస్సులు, ప్రోత్సాహం నిరంతరం ఇస్తారని కోరుకుంటున్నాను.

నా పూరణ......

సంసారపు ధర్మమెరిగి
సంసారమున౦దె యు౦డి చక్కగజేయన్,
కాసారపు జలజ మటుల
సంసారిగ నున్న వాఁడె సన్యాసి యగున్.

మరియొక పూరణ:

సంసారపు మాధుర్యము
ఆసాంతము పొందినట్టి ధన్యుడెయైనన్,
వేసారిన జీవుడయిన
సంసారిగ నున్న వాఁడె సన్యాసి యగున్.

చింతా రామ కృష్ణా రావు. said...

సుమిత్రగారూ! నమస్తే.
మీరేమీ అనుకోకపోతే నాదో చిన్న సూచన.
కంద పద్యంలో నైనా మరే పద్యంలో నైనా సరే ప్రాస నియమం ఉన్న చోట ప్రయోగించే టప్పుడు దానికి గల నియమాన్ని అతిక్రమించ కూడదు.

ప్రాస పూర్వాక్షరం గురువుంటే అంతటా గురువే ఉండాలి. లఘువుంటే లఘువే ఉండాలి.
అలాగే ప్రాససంయుక్తాక్షరమైతే అన్ని పాదాలలోను సంయుక్తాక్షరమే ఉండాలి.
ప్రాస అక్షరానుకి ముందు సున్నా ఉంటే అనుస్వార పూర్వక ప్రాసాక్షరమే అంతటా ఉండాలి.
మీ పూరణలో ఆ నియమాన్నతిక్రమించినట్టున్నారు. సరిచూడండి.

సుమిత్ర said...

ఆర్యా!
మీ సూచన గ్రహించితిని. నేను పద్య రచన యందు ఆసక్తితో ప్రయత్నం చేస్తున్నాను. మీరు నిరభ్యంతరంగా ఇలాగే సలహాలు, ఆశీస్సులుతో ప్రోత్సహించగలరు.