Monday 5 July 2010

"భగణంబున గురువు నాస్తి పండితులారా!"

అని దూరదర్శన్ వారి మరొక సమస్య. ప్రయత్నించండి.

9 comments:

కంది శంకరయ్య said...

(1)
నగణ మన మూడు లఘువులు
గగన గణము, శుభకరమని ఖ్యాతి గడించెన్
తగ కావ్యాదిని నిలుపు శు
భ గణంబున గురువు నాస్తి పండితులారా!
(2)
తగ నొకఁడు "విద్రుచు" వ్రాసెను
భగణంబుగ పద్యమందు; పండిత సభలోఁ
దెగడెను మరి యొకఁ "డిచ్చట
భగణంబున గురువు నాస్తి పండితులారా!"

(ఎద్రుచు, పద్రుచు, విద్రుచు, కద్రుచు మొదలైన శబ్దాలు నగణాలే అని ఛందశ్శాస్త్రం చెప్తున్నది)

ఊకదంపుడు said...

నగవే పెండ్లియన?కటా!
వగవన్ తగునే అటుపయి వైదికులారా?
తగదీ జాతకమె గన శు
భ గణంబున గురువు నాస్తి పండితులారా!

Unknown said...

మా తాతగారు ఇలా పూరించారు.

"భగణము"నందలి నాల్గును
లఘువులెపో నరసి చూడ, లయబద్ధముగా
'భగణము''నల'గణమే యగు
భగణంబున గురువు నాస్తి పండితులారా!

Sai Praveen said...

అందరి పూరణలు చాల బాగున్నాయండి

సుమిత్ర said...

శంకరయ్యగారు, పూరణ బాగుంది. ధన్యవాదాలు.
ప్రజ్ఞాదీప్తి మీ తాతగారి పూరణ బాగుంది.ధన్యవాదాలు.
సాయిప్రవీణ్ గారు, నా బ్లాగుకుసుస్వాగతం.

ఈ సమస్యకు నా పూరణ ఇలా ఉంది.

జగముల నేలిన 'భరతుడు',
అఘమంటని 'జడభరతుడు','భరణి'ఎ యైనన్
అగణిత యశమందిన ఈ
"భగణంబున గురువు నాస్తి పండితులారా!"

('భరతుడు'=రాజు, 'జడభరతుడు'=ముని, 'భరణి'=నక్షత్రం. వీరు మువ్వురు యశస్సు పొంది నప్పటికీ గురువులు కారు.
మరియొక అర్థంలో 'ఈ' పదాలలో 'భగణ౦' లేదు.)

కంది శంకరయ్య said...

ప్రజ్ఞా దీప్తి తాత గారి పూరణ చాలా బాగుంది.
ఇక మీ పూరణలో రెండవ పాదంలో ప్రాస తప్పింది. ఆ పాదాన్ని "వగ పెఱుఁగని "జడభరతుఁడు", "భరణి"యె యైనన్" అని సవరిస్తే సరి. ఏమంటారు?

జిగురు సత్యనారాయణ said...

తగునట కేంద్రము కోణము
మిగుల శుభగ్రహములున్న మేలగు రీతిన్
సుగమము కాదిక నట్టి స
భ గణంబున గురువు నాస్తి పండితులారా!"

{వివరణ: జ్యోతిష్య శాస్త్రము ప్రకారము కేంద్ర కోణాలల్లో శుభ గ్రహములు ఉంటే మంచింది. అటువంటి గృహ సమూహములో (అనగా కేంద్ర కోణాలల్లో) శుభ గ్రహమైన గురువు (బృహస్పతి) లేనిచో అది సుగమము కాదు}

జిగురు సత్యనారాయణ said...

"సభ గణంబు" - సరైన సమాసము కాదనుకుంట. "సభా గణంబు" అని ఉండాలేమో. కాబట్టి దానిని "శుభ గణంబు" గా చదువుకోవలసినిదిగా మనవి.

సుమిత్ర said...

ఉకదంపుడుగారు,
సత్యనారాయణగారు,
పూరణలు బాగున్నాయి.ఇలాగే మీ ప్రోత్సాహాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

శంకరయ్య గారు,
సూచనకు ధన్యవాదములు. టైపింగులో పొరపాటు జరిగిందండి.