Thursday 17 June 2010

సమస్యాపూరణం 2

కవి మిత్రులకు నేటి సమస్య.

రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్

8 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

కామాంధుల దౌష్ఠ్యంబులు
రాముఁడు సీతయును గాంచి రగులగ మనముల్.
ప్రేమోన్మాదుల దునుమగ
రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్

కంది శంకరయ్య said...

రామయణ నాటకమును
గ్రామంబున వేయఁ బూని కట్టిరి వేషాల్
సోముఁడు రాముండయ్యెను
రాముఁడు రాక్షసుఁడు, సీత రక్కసి యయ్యెన్.

ఏమని పెట్టిరొ తల్లులు
ప్రేమను తమ పిల్లలకును పేర్లను; కానీ
భీముండు పిరికివాఁడుగ
రాముఁడు రాక్షసుఁడు, సీత రక్కసి యయ్యెన్.

జిగురు సత్యనారాయణ said...

కాముడి కోరిక పుట్టగ
ప్రేమగ రఘురాము సీత రీతిగ మారెన్
కామము తీరిన పిమ్మట
రాముడు రాక్షసుడు, సీత రక్కసి యయ్యెన్!!

సుమిత్ర said...

@చింతా రామకృష్ణారావు గారు, ఈ కాలంలో ఎంతమంది సీతారాములు కావాలో!

@కంది శంకరయ్య గారు,
మీ పద్యనాటకం బాగుంది. ఆనందింపజేసింది.

ఈ కాలంలో పేర్లకు, ప్రవర్తనకు సంబంధం లేదని భలేగా ముక్తాయిన్చారు.

@జిగురు సత్యనారాయణ గారు, రూపాలు చక్కగా మార్చారు, ఆనందం.

పూజ్యులందరికి,
వాస్తవానికి మీ రచనలను అభినందించే స్థాయి నాది ఎంత మాత్రము కాదు. మీ ఆశీస్సులే నాకు ప్రేరణ. మనోభావాలు వ్యక్తపరచడం అంటే ఇష్టం, అదే ఈ ప్రయత్నం.

నా పూరణ చూడండి.

"ఏమని పల్కెద! మా దై
వమ్మును, సత్పతుల, సంతు వధియింపంగా,
ఇమ్మహినసురుల పాలిట
రాముడు రాక్షసుడు, సీత రక్కసియయ్యెన్!"

రావణ వధానంతరం రాక్షస స్త్రీల ఆక్రందనగా ఈ భావాన్ని పూరించాను.

చింతా రామ కృష్ణా రావు. said...

మాష్టారూ!
మీపూరణచూచాను. భావం చాలా బాగుంది. కాని
పూరణ విషయంలో మాత్రం మీసమస్యను మీరు కందంలో పూరిస్తున్నప్పుడు పద్యరచనలోని నియమాతిక్రమణ జరిగిందని గుర్తించ గలరు.
చూడండి మీరు వ్రాసింది.

నా పూరణ చూడండి.

"ఏమని పల్కెద! మా దై
వమ్మును, సత్పతుల, సంతు వధియింపంగా,
ఇమ్మహినసురుల పాలిట
రాముడు రాక్షసుడు, సీత రక్కసియయ్యెన్!"

రావణ వధానంతరం రాక్షస స్త్రీల ఆక్రందనగా ఈ భావాన్ని పూరించాను.

చూచారు కదా!
కందమ్మున ప్రాసను గన
అందమ్ముగ మొదటి హల్లు అలరినగతిలో
సుందరముగ మిగిలినవియు
అందమ్ముగ నొప్ప వలయు. అట ద్విత్వమెటుల్?

ఏమనిలో మ ప్రాసగు.
ధీమతి!అట వమ్ము; యిమ్ము తెలియగ రావే!
నా మాటలు మన్నించుచు
నీమంబుకు నప్పునట్లు నెరవేర్చుడయా!

hhtp://andhraamrutham.blogspot.com లో నాచే నిర్వహింపఁబడుతున్న ఆంధ్రామృతం లభిస్తుంది. అందు పద్యరచన అనే లేబుల్ ఓపెన్ చేస్తే మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.

రాజేశ్వరి నేదునూరి said...

అందరికి నమస్కారములు " సమస్యా పూరణలు ఎంతో బాగున్నాయి

సుమిత్ర said...

ఆర్యా! గత వారం రోజులుగా నేను గ్రామాంతరంలో ఉండడం వలన మీ సూచన చూడలేకపోయాను. సవరించిన నా పురణ పరిశీలించగలరు.

"ఏమని పల్కెద! మా దై
వము, మరి సత్పతుల, సంతు వధియింపంగా,
ఈ మహినసురుల పాలిట
రాముడు రాక్షసుడు, సీత రక్కసియయ్యెన్!"

సుమిత్ర said...

రాజేశ్వరి నేదునూరి గార్కి,
నా బ్లాగులోనికి సుస్వాగతం. మీ అభినందనలకు ధన్యవాదములు.